నల్లగొండ, జూలై 14 (చైతన్యగళం): సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన విధానాన్ని మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు.మంగళవారం ఎలక్ట్రిసిటీ ఉద్యోగ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను ఎస్‌ఈ కార్యాలయం, ఎలక్ట్రిసిటీ స్టోర్లలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ, “2003లో వాజ్‌పాయ్ ప్రభుత్వం విద్యుత్ చట్టం తెచ్చింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వేగవంతం చేస్తూ విద్యుత్ సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2025 బిల్లుగా అమల్లోకి తెస్తోంది. ఈ చర్యలన్నీ విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు దారితీస్తున్నాయి” అని ఆరోపించారు.ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 17న ఉపముఖ్యమంత్రి సమక్షంలో హామీలు ఇచ్చినా, 68 రోజులు గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఆయన తీవ్రంగా ఖండించారు. “వేతన ఒప్పంద గడువు ముగిసి రెండు నెలలు దాటింది. ఆలస్యం చేయకుండా 2026 పిఆర్సీని నియమించి వేతన ఒప్పందం అమల్లోకి తేవాలి. పెన్షనర్లతో కలిపి 70 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగే ఈ అంశంపై అన్ని కార్మిక సంఘాలు జోక్యం చేసుకోవాలి” అని డిమాండ్ చేశారు.ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు, ఇంజనీర్లతో సహా ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని, లబ్ధిదారులకు వాస్తవాలు తెలియజేసి వారిని సమీకరించి పోరాటాల ద్వారానే సంస్థను కాపాడుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల యాదయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు జంజరాల శ్రీనివాస్, సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.