పెద్దపల్లి, జూలై 14 (చైతన్యగళం): పెద్దపల్లి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మున్సిపల్ బిల్లుల మంజూరు విషయంలో నాలుగు లక్షల యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన ఆయన, కాంట్రాక్టర్ శ్రీనివాస్ వద్ద రెండు లక్షల రూపాయలు స్వీకరిస్తూ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు.
తరువాత ఏసీబీ అధికారులు సతీష్ నివాసంలో సోదాలు నిర్వహించి, పెద్ద ఎత్తున నగదు కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు సోదాల్లో 32 లక్షల రూపాయలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఏఈ సతీష్‌ను మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. “లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ సతీష్ ఇంట్లో భారీగా నగదు లభించింది. విచారణ కొనసాగుతోంది” అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు.