CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 1:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మేరా యువభారత్తో యువతకు మరిన్ని అవకాశాలు

కరీంనగర్, జూలై 14 (చైతన్య గళం): కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, యువభారత్ మై భారత్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో 2026–27 సంవత్సరానికి సంబంధించిన జిల్లా అడ్వైజరీ కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గత ఏడాది నిర్వహించిన యువజన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. కమిటీ సభ్యులు చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని యువతకు మరింత ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాలను అమలు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త యూత్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, గ్రామీణ స్థాయి నుంచి యువతను సంఘటితం చేయాలని, మై భారత్ ఆధ్వర్యంలో యువజన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. పోస్టర్‌లో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి జిల్లాలోని యువత అధిక సంఖ్యలో మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి, డీఆర్‌డీఓ గీత, జడ్పీ ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, జడ్పీ సీఈవో పవన్ కుమార్, డీవైఎస్‌వో శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోల్మాన్ రాజు, జిల్లా యూత్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ బి. రవీందర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.