చొప్పదండి, జూలై 14 (చైతన్య గళం): చొప్పదండి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు.
వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, యూరియా కొరత లేకుండా తగిన నిల్వలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే విద్య, వైద్యం, రవాణా రంగాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే వినతిపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సానుకూలంగా స్పందిస్తూ, చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలకు తగిన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు.