కరీంనగర్, జూలై 14 (చైతన్యగళం):
రైతులకు సాగునీటి భరోసా కల్పించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ను సోమవారం సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.
డ్యామ్‌లోని నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్, సాగునీటి అంశంపై పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను ఎల్లంపల్లి, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్‌కు తరలించాలి. ఖరీఫ్ సాగు సీజన్‌లో రైతులకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజకీయాలకు అతీతంగా రైతాంగ ప్రయోజనాలే ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.