CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

చిట్టి నారుకు ప్రాణం పోయాలి… వాన కోసం ఎదురు చూస్తున్న రైతన్న.

నింగి కనురెప్పలు మూసుకున్నాయో ఏమో…
వానచినుకుల జాడే లేదు…
పుడమి తల్లి గుండె పగుళ్లతో విలవిల్లాడుతుంటే,
నారు మడుల్లో పచ్చని ప్రాణాలు
ఎండగాలికి తలవంచుతున్నాయి…!

ఎల్‌నినో ఎండల ఎగతాళిలో
రైతన్న ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి.
తొలకరి వాన పలకరించినా
భూమి దాహం తీరలేదు…
పచ్చని భవిష్యత్తు ఇంకా చిగురించలేదు.

ఆకాశం నల్లని మేఘాల చీర కట్టినా,
మెరుపులు మెరిసినా, ఉరుములు గర్జించినా,
చినుకుల కరుణ మాత్రం కురవలేదు…
గడ్డిపోచ చివరనైనా
నీటి ముత్యం మెరవలేదు.

ఆషాఢం వచ్చిందంటే
పొలాల్లో పచ్చదనం పరవళ్ళు తొక్కాలి…
కానీ ఈసారి
వేసవి ఇంకా వీడలేదు.
చెరువులన్నీ ఎండిన కన్నీటి గుంటలై,
కలువలు కూడా కళ్లు తేలవేస్తున్నాయి.

చిట్టి నారు
తల్లి ఒడిలోని పసిబిడ్డలా
ఒక్క నీటి చుక్క కోసం ఎదురుచూస్తోంది.
ఆ చిన్న మొక్కలోనే
రైతన్న ఏడాది శ్రమ,
కుటుంబం ఆశ,
దేశం అన్నం దాగి ఉంది.

పట్టిసీమ జలాలు త్వరగా చేరాలి…
ఎండిన నారుకు మళ్లీ ఊపిరి పోయాలి…
చివరి ఆయకట్టు పొలం వరకూ
సాగునీరు పరుగులు తీయాలి.
పాలకులు తక్షణ చర్యలు తీసుకొని
రైతన్నను ఆదుకోవాలి.

రైతు బతికితేనే పంట బతుకుతుంది…
పంట బతికితేనే దేశం బతుకుతుంది…
ఆ చిట్టి నారుకు ప్రాణం పోయడం అంటే…
మన భవిష్యత్తుకే ఊపిరి పోయడమే..!

వేల్పుల మహేందర్.
అధ్యాపకులు.