CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:51 am Posted by : CHAITHANYA GALAM NEWS

కార్పొరేట్ ఆసుపత్రి పై చర్యలకు ఏఐఎఫ్బి డిమాండ్

కరీంనగర్ (చైతన్యగళం):
నగరంలోని సన్‌షైన్ హాస్పిటల్ నిర్వహణలో తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బి) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించారు.

ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ, సన్‌షైన్ హాస్పిటల్‌లో ఎన్డిపిఎస్ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నివేదికలో తేలిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనల ప్రకారం ఆసుపత్రి రిజిస్ట్రేషన్, ఫార్మసీ లైసెన్స్‌ను రద్దు చేయాలని, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు అధికారిక ఫిర్యాదు పంపి సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రిలో కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న సన్‌షైన్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాల ఎంపెనీల్మెంట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే కఠినమైన చట్టపరమైన చర్యలే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే (IAS) ఆధ్వర్యంలో 10 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత రాజిరెడ్డి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.