CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 7:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి – టీపీటీఎఫ్

హైదరాబాద్, జూలై 14 (చైతన్యగళం):
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును తెలంగాణ సచివాలయంలో కలిసింది. శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేసింది.

ఈ సందర్భంగా టీపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, “2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, నూతన ఆరోగ్య పథకం మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలి. పెండింగ్ డీఏలను విడుదల చేసి, పిఆర్సీని ప్రకటించి అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు.

అలాగే, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని, మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలను విద్యాశాఖలో విలీనం చేసి టీచర్లకు నూతన ఆరోగ్య పథకం వర్తింపజేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని, అన్ని యాజమాన్యాల్లో ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రాతినిధ్యం చేసిన వారిలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. లక్ష్మయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల బాలయ్య పాల్గొన్నారు.