CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 3:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జీవో 641 రద్దు చేయాలంటూ రైతుల ధర్నా

  • కాలుష్య డంపింగ్ యార్డు వద్దు

షాద్‌నగర్, జూలై 13 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న చెత్త డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, రైతులు వందలాదిగా జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సిద్దాపూర్ గ్రామ పరిధిలో పార్టీలకు అతీతంగా ఏర్పాటైన డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై, అక్కడినుంచి నేరుగా జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన తెలిపారు. జీవో నంబర్ 641ను రద్దు చేయకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

డంపింగ్ యార్డు వల్ల పచ్చని పంట పొలాలు, నీటి వనరులు కాలుష్యం అవుతాయని, పంటలే జీవనాధారంగా ఉన్న రైతులకు బ్రతుకు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.