CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 2:44 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

చైతన్యగళం: హోర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్ గెలాక్సీ(GFS Galaxy) వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. దాడి అనంతరం నౌకలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది నౌకను విడిచి పరారయ్యారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా.. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఓ భారతీయుడు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ఒమన్‌ అధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం చట్ట విరుద్ధమని ఈ సందర్భంగా భారత్ స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేసి, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని కోరింది.

కాగా.. అనుమతిలేని మార్గంలో నౌక ప్రయాణిస్తోందన్న కారణంతోనే ఈ దాడి చేపట్టామని ఇరాన్ పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఘటన అనంతరం హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేసింది. అమెరికా మరోసారి దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారాయి.