CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 2:38 pm Posted by : CHAITHANYA GALAM NEWS

జిల్లాస్థాయి ఇన్-సర్వీస్ శిక్షణ తొలి స్పెల్ ముగింపు కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్(చైతన్యగళం):

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. పట్టణంలోని అనంతారం టీఎస్ మోడల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న “ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్‌ఫార్మేటివ్ క్లాస్‌రూమ్ ప్రాక్టీసెస్” జిల్లాస్థాయి ఇన్-సర్వీస్ శిక్షణ తొలి స్పెల్ ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమ బోధనను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ బోధనకు బదులుగా విద్యార్థి కేంద్రిత, ఆలోచనాత్మక, సృజనాత్మక బోధనా విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లెర్నింగ్, అనుభవాత్మక బోధన, సమగ్ర మూల్యాంకన విధానాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని గుర్తించి, వారికి అనుగుణంగా బోధన అందించడం ద్వారా నాణ్యమైన అభ్యాస ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో అమలు చేసి విద్యార్థుల అభ్యాస ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సత్యనారాయణమూర్తి, ట్రైనింగ్ సెంటర్ ఇన్‌చార్జి మందుల శ్రీరాములు, ఏఎంఓఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ వంగ సురేష్, జేకేఓ గాయత్రి, ఎంఈఓలు, సమ్మెట సతీష్, డీఆర్‌పీలు, సీఆర్‌పీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.