CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

హుజురాబాద్, జూలై 10 (చైతన్య గళం): 

పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పారిశుద్ధ్య సమస్యలు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ, ప్రధాన చౌరస్తాల పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులను నిలదీస్తూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణను ప్రతిరోజూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధాన చౌరస్తాలు, రహదారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

“ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఉపేక్షించేది లేదు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు” అని ఎమ్మెల్యే హెచ్చరించారు. హుజురాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా, సమస్యల రహితంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.