CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఫ్యూచర్ సిటీ రహదారి భూసేకరణకు మేడిపల్లి గ్రామస్తుల సమ్మతి

యాచారం, జూలై 08 (చైతన్యగళం): ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా నిర్మించనున్న రహదారికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో భాగంగా మేడిపల్లి గ్రామస్తులు ప్రభుత్వానికి తమ సమ్మతి తెలిపారు.

బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి ఛాంబర్‌లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భూసేకరణ ప్రక్రియ, పరిహారం చెల్లింపు, ప్రభుత్వ నిబంధనలు, రైతులకు కల్పించబడుతున్న ప్రయోజనాలపై సమగ్రంగా వివరించారు. అనంతరం గ్రామస్తులతో జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయి.

ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గ్రామస్తులు అంగీకారం వ్యక్తం చేస్తూ తమ సమ్మతి పత్రాలను (Consent Petitions) అదనపు కలెక్టర్‌కు అందజేశారు. భూసేకరణ ప్రక్రియను పరస్పర అవగాహనతో, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన గ్రామస్తులకు అదనపు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, భూసేకరణ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.