CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:44 pm Posted by : rakeshkashaveni12@gmail.com

భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి-ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు

కరీంనగర్, జూలై 8(చైతన్యగళం):

జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) భూ సేకరణ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూ సేకరణ పురోగతిని సమీక్షించారు.

శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాలేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్, మానేరు రివర్‌ఫ్రంట్ తదితర ప్రాజెక్టుల భూ సేకరణ స్థితిగతులను తెలుసుకున్న కమిషనర్, రెవెన్యూ–ఇరిగేషన్ సహా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస కార్యక్రమాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్వాసిత రైతులు, ప్రజలకు నిబంధనల ప్రకారం పరిహారం అందించి పునరావాస చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ, ఎస్‌డీసీ స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.