CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:47 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మీసేవ సేవలపై జిల్లా స్థాయి సమీక్ష

సిద్దిపేట, జూలై 8(చైతన్యగళం):

జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఓ సమన్వయంతో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కమఠం ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా, డీపీఎం సరిత పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల వీఎల్ఈలతో సేవల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే          యు డి ఐ డి.  యూనిక్ డిసెబిలిటీ ఐడీ  పోర్టల్ ద్వారా దివ్యాంగులకు అందించే సేవలు, దరఖాస్తుల నమోదు విధానం, ఎన్ ఎఫ్ బి ఎస్.  నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత ప్రమాణాలపై వీఎల్ఈలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.

త్వరలో మీసేవ ద్వారా అందుబాటులోకి రానున్న కొత్త సేవలపై కూడా అధికారులు వివరించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు వీఎల్ఈలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సేవల అమలులో సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీసేవ కేంద్రాల్లో చార్ట్ బోర్డులో పేర్కొన్న అధికారిక రుసుములను మాత్రమే వసూలు చేయాలని, అదనపు రుసుములు తీసుకోరాదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే సీఎస్‌సీఎల్‌ఏ జారీ చేసిన ఆదేశాల మేరకు కొన్ని సేవలకు సంబంధించిన భౌతిక పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఈ అవగాహన సదస్సు ద్వారా వీఎల్ఈలకు మీసేవ సేవల నిర్వహణపై మరింత స్పష్టత లభించిందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎం నరేష్, సీఎస్‌సీ డీఎం శ్రీనివాస్‌తో పాటు జిల్లాలోని మీసేవ వీఎల్ఈలు పాల్గొన్నారు.