CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 9:15 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శాతవాహనలో సాంప్రదాయ వైద్యంలో కృత్రిమ మేధస్సు పాత్రపై సదస్సు

కరీంనగర్, జూలై 08 (చైతన్యగళం):
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు పాత్ర అనే అంశంపై ఒకరోజు సదస్సు ఘనంగా జరిగింది.

ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ – భారతదేశపు ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత అయిన కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే సురక్షితమైన కొత్త ఔషధాలను కనుగొనవచ్చని అన్నారు. పరిశోధనల్లో విద్యార్థులు ఇలాంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి మాట్లాడుతూ – సహజ సిద్ధ మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాస్త్రీయ డేటా ఆధారిత పరిశోధనలు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ముఖ్య వక్తగా హైదరాబాద్‌లోని సి.ఎస్‌.ఐ.ఆర్ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకు చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె. నాగయ్య పాల్గొని, సాంప్రదాయ మూలికల నుండి ఔషధ కణాలను తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో వేరు చేయడంలో ఏఐ అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్ ఎలా ఉపయోగపడుతున్నాయో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కృత్రిమ మేధస్సు సహాయంతో తక్కువ ఖర్చుతో కొత్త ఔషధాలను తయారు చేసి మానవాళికి అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డా. ఎస్. రమాకాంత్ (ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్), కన్వీనర్‌గా డాక్టర్ జయంతి, సహకారిగా డా. సరసిజ నమ్రత వ్యవహరించారు.

సదస్సులో అధ్యాపకులు డా. క్రాంతి, డా. శ్రీశైలం, డా. శ్రీవిద్య, డాక్టర్ రాజు, డా. విజయ్ కుమార్, డా. మల్లారెడ్డిలతో పాటు ఫార్మసీ, కెమిస్ట్రీ విభాగాల విద్యార్థులు పాల్గొని వక్తలతో ముఖాముఖి చర్చలు జరిపారు.