హుజురాబాద్, జూలై 8 (చైతన్యగళం):
వీణవంకలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూలై 6న చల్లూరు గ్రామానికి చెందిన వేముల పద్మ (45) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి దొంగతనం ఉద్దేశంతో చొరబడి, ఆమెను బలవంతంగా పట్టుకుని బంగారు తాడును గుంజేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన బాధితురాలిపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె కేకలు విని కుమార్తె శాముల నవ్యశ్రీ (24), మరిది శాముల సంపత్ (38) అక్కడికి చేరుకోవడంతో నిందితుడు భయపడి, తన సైకిల్, సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలి పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వీణవంక పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా నిందితుడిని పిల్లి సదయ్య (45), ఎల్బాక గ్రామం, వీణవంక మండలంగా గుర్తించారు. చాకచక్యంగా పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.