CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 11:26 am Posted by : CHAITHANYA GALAM NEWS

అక్రమ ఇసుక రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల వరుస చర్యలు

కరీంనగర్, జూలై 8 (చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో పలు ప్రాంతాల్లో అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన మూడు ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకుని, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మానేరు వాగులో కోతిరాంపూర్‌కు చెందిన ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

నెడునూరు గ్రామ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రెండు అక్రమ ఇసుక డంపులను గుర్తించారు. ఒక డంపులో సుమారు 25 ట్రిప్పులు, మరొక డంపులో 10 ట్రిప్పుల ఇసుక నిల్వ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఒక ట్రాక్టర్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, “అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయి. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అని హెచ్చరించారు.