CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:12 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దిశ కమిటీ సమావేశంలో అభివృద్ధి పథకాలపై దిశానిర్దేశం

మహబూబాబాద్, జూలై 7 (చైతన్యగళం): జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన దిశ కమిటీ సమావేశానికి పార్లమెంటు సభ్యుడు, కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయం, వైద్యం, గృహనిర్మాణం, విద్య, రహదారులు, తాగునీరు, సంక్షేమం వంటి రంగాల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ పెండింగ్ సాగునీటి పనులు, రహదారి అభివృద్ధి, విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, స్వయం సహాయక సంఘాల ద్వారా డ్రోన్ల సాయంతో నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పంట మార్పిడి, ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.