CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:13 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

  • షీ టీం–భరోసా–ఏహెచ్‌టీయూ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం

మహబూబాబాద్, జూలై 7 (చైతన్యగళం): చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.

విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో ఉండాలని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

మహబూబాబాద్ షీ టీం హెల్ప్‌లైన్ 8712656935, అత్యవసర సేవల నంబర్లు 100/112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళల హెల్ప్‌లైన్ 181/1091 సేవల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంజీ నాయక్, ఉపాధ్యాయులు, షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, ప్రియాంక, ఏహెచ్‌టీయూ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, సుప్రజ, భరోసా సిబ్బంది రేణుక తదితరులు పాల్గొన్నారు. సుమారు 150 మంది విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమం అనంతరం ప్రధానోపాధ్యాయులు రాంజీ నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత, వ్యక్తిత్వ వికాసం కోసం నిర్వహిస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.