CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 5:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎంపీలకు పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు

న్యూఢిల్లీ, జూలై 06(చైతన్యగళం): పార్లమెంట్ సభ్యులకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సభలో తాము అడిగే ప్రశ్నలు, వాటికి ప్రభుత్వం ఇచ్చే సమాధానాల విషయంలో కఠినమైన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. సభలో అధికారికంగా సమర్పించకముందే ఆయా ప్రశ్నల తాలూకు సమాధానాలను ముందస్తుగా మీడియాకు గానీ, ఇతర బయటి వ్యక్తులకు గానీ వెల్లడించకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా ముగిసే వరకు సభ్యులు అత్యంత గోప్యతను పాటించాల్సి ఉంటుంది. మంత్రులు నేరుగా నోటి ద్వారా సమాధానం చెప్పే నక్షత్ర గుర్తు ప్రశ్నలతో పాటు, సభలో చర్చకు రాకుండా పట్టికపై ఉంచే నక్షత్ర గుర్తు లేని ప్రశ్నల సమాధానాలను కూడా ప్రశ్నోత్తరాల సమయం ముగిసే వరకూ బహిర్గతం చేయడానికి వీల్లేదు. సభ్యుల సౌకర్యార్థం కేటాయించిన ప్రత్యేక లాగిన్ ఐడీల ద్వారా పార్లమెంట్ మెంబర్స్ పోర్టల్‌లో ఈ సమాధానాలను ముందస్తుగా అందుబాటులో ఉంచినప్పటికీ, అది కేవలం వారి వ్యక్తిగత పరిశీలన కోసమేనని సెక్రటేరియట్ స్పష్టం చేసింది.

ఈ వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం గానీ, ప్రెస్ నోట్ల రూపంలో విడుదల చేయడం గానీ సభా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. సభ డిగ్నిటీని, సాంప్రదాయాలను కాపాడటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన సెక్రటేరియట్ వర్గాలు.. ఈ నిబంధనలను అతిక్రమించి, సభ కంటే ముందే సమాచారాన్ని లీక్ చేసే సభ్యులపై నిబంధనావళి ప్రకారం కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశాయి.