భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంట్లో పనికిరాని పాత పరుపులు, సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు వంటి భారీ వ్యర్థాలను ఇకపై రోడ్లపై, మురుగు కాలువల్లో పడేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్(చైతన్యగళం): భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంట్లో పనికిరాని పాత పరుపులు, సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు వంటి భారీ వ్యర్థాలను ఇకపై రోడ్లపై, మురుగు కాలువల్లో పడేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాత పరుపులు, ఫర్నిచర్‌ను ఇళ్ల వద్ద నుంచే ఉచితంగా సేకరించే ప్రత్యేక సేవను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా భారీ వ్యర్థాలను వీధులు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో పడేయకుండా నూతన సేవను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. ఈ మార్పు హైదరాబాద్ పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదం చేస్తుందని పేర్కొంది. ఇంటి వద్దకే వచ్చి పాత పరుపులు, ఫర్నిచర్‌ను ఉచితంగా సేకరించి, సురక్షితమైన, శాస్త్రీయ విధానంలో రీసైక్లింగ్ చేస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇందుకోసం క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి డోర్‌స్టెప్ పికప్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని సూచించింది.
ప్రస్తుతం ఈ సేవ తమ పరిధిలోని ఆరు జోన్లలో అందుబాటులో ఉందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వెల్లడించింది. సేవా పరిధిని కవరేజ్ మ్యాప్ ద్వారా తెలుసుకుని, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఉచిత పికప్‌ను బుక్ చేసుకోవాలని సూచించింది. భారీ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జీహెచ్‌ఎంసీకి అప్పగించడం ద్వారా పరిశుభ్రమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.