CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 11:18 am Posted by : CHAITHANYA GALAM NEWS

పోక్సో చట్టంపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరం: అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ్

మహబూబాబాద్(చైతన్యగళం):  పోక్సో (POCSO) చట్టంలోని నిబంధనలు, పిల్లల హక్కులపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ్ అన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఉన్న ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల పోక్సో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాలబాలికల్లో ఆ చట్టంపై సరైన అవగాహన లేకపోవడం ఆందోళనకరమన్నారు. విద్యార్థినులు తమ దృష్టిని చదువు, క్రీడలు, సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధిపై కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని, ముఖ్యంగా విద్యార్థులపై వాటి ప్రభావం అధికంగా ఉందన్నారు. ఇవి జ్ఞానాన్ని అందించే సాధనాలే అయినప్పటికీ, దుర్వినియోగం చేస్తే భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం, సైబర్ వేధింపులకు గురికావడం వంటి ఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాను కేవలం అవసరమైన సమాచార సేకరణకే పరిమితం చేస్తేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని సూచించారు.

ర్యాగింగ్ విద్యార్థుల జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసే సామాజిక దురాచారమని పేర్కొన్న ఆయన, ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులు జైలు శిక్షతో పాటు విద్యాసంస్థల నుంచి సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

పోక్సో చట్టంలోని సెక్షన్–22 ప్రకారం, ఎవరినైనా అవమానించేందుకు లేదా కక్షసాధింపు కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదుదారుడికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ పి. రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి. కోటేశ్వరి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.