CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందాలి – సీఐ వెంకటేశ్వర్లు

ఆమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆమనగల్లు పట్టణంలోని మానస గార్డెన్‌లో అంబేద్కర్ యువజన సంఘం, బుద్ధా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లండం చిన్న జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ కోటేశ్వర్, ప్రముఖ సంఘసేవకుడు, 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తొలుత గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు చెస్ వంటి మేధో క్రీడల్లోనూ రాణించాలని, ఇవి ఏకాగ్రత, సహనం, విశ్లేషణాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో చెస్ నేషనల్ ప్లేయర్, రిటైర్డ్ హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి, చెస్ కోచ్ మల్లేష్, మీసాల రమేష్, అంబేద్కర్ యువజన సంఘం ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ లండం యాదయ్య, ఉపాధ్యక్షుడు వస్పుల సురేష్, జాయింట్ సెక్రటరీ ఎం.డి. అప్సర్, కోశాధికారి లండం గిరి, పసుపుల శేఖర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మద్దెల మల్లేష్, లండం మహేష్, లండం శివ, సంఘ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.