అమనగల్లు, జూలై 4 (చైతన్యగళం): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు తలకొండపల్లి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వాహనాల్లో బయలుదేరిన శ్రేణులను ఏఎంసీ డైరెక్టర్ ఎండీ అజీమ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎ. రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి అదే ప్రాంతంలో కృతజ్ఞత సభ నిర్వహించడం చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సభ విజయవంతం కోసం తలకొండపల్లి మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివెళ్లడం పార్టీపై ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, యువజన కాంగ్రెస్ నాయకులు జూలపల్లి శ్రీనివాస్, మల్లేష్, శంకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.