CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:14 pm Posted by : rakeshkashaveni12@gmail.com

గర్రెపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు బ్రేక్ ప్రభుత్వ బడికే గ్రామం మద్దతు

సైదాపూర్ , జూలై 3(చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామపంచాయతీ ప్రభుత్వ విద్య బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదవాలనే లక్ష్యంతో గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సుల ప్రవేశాన్ని నిషేధిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి ప్రవేశిస్తే సంబంధిత యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పాలకవర్గం స్పష్టం చేసింది.
ఇటీవల గ్రామస్థుల సమిష్టి కృషితో నాలుగేళ్ల తర్వాత గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామపంచాయతీ తెలిపింది.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చేసిన పిలుపు మేరకు ఈ తీర్మానం చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం వెల్లడించింది మా పిల్లలు మా ప్రభుత్వ బడిలోనే చదవాలి అనే నినాదంతో ప్రభుత్వ విద్యాభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం పిలుపునిచ్చింది