CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 9:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచనలు

వంగూరు, జూలై 3 (చైతన్యగళం): వంగూరు మండలంలోని వెలమలపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలోని పోలింగ్ కేంద్రం నం.20 పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల ధ్రువీకరణ, డిజిటలైజేషన్ విధానాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో 348 మంది ఓటర్లకు 100% ఫారాలు పంపిణీ చేసినట్లు, ఐదుగురి వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వంగూరు మండలంలో ఉన్న 33,395 మంది ఓటర్లలో 90% పంపిణీ ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ నివేదించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, “ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో పేరు తప్పకుండా ఉండేలా చూడాలి. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదురైతే బీఎల్వోలు సహాయం చేయాలి” అని సూచించారు.

అధికారులకు ఆయన ఆదేశిస్తూ, “ఫారాలు నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రోజువారీ పురోగతిని సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలి. సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి” అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, వంగూరు తహసీల్దార్ మురళీమోహన్, బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.