రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ సేవారత్నతో పాటు తొమ్మిది అవార్డులు..
మహబూబాబాద్/హైదరాబాద్, జూలై 3(చైతన్యగళం): రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని కొంపెల్లి వేదికగా నిర్వహించిన రోటరీ డిస్ట్రిక్ట్-3150 వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్తమ సేవారత్న అవార్డు లభించింది. అంతేకాకుండా వివిధ సేవా విభాగాల్లో మరో తొమ్మిది అవార్డులు దక్కించుకుని రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది.
డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ చేతుల మీదుగా క్లబ్ అధ్యక్షుడు వేమిశెట్టి కిషోర్ కుమార్, కార్యదర్శి జంగాల విజయ్ కుమార్, వ్యవస్థాపకులు మాలె నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ లీడర్ వద్దుల సురేందర్ రెడ్డి, ట్రెజరర్ శంతన్ రామరాజు, సీనియర్ రొటేరియన్లు బిక్కి వెంకటేశ్వర్లు, తొర్నాల నగేష్ కుమార్ తదితరులు అవార్డులను స్వీకరించారు.
ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, 2009లో ప్రారంభమైన మహబూబాబాద్ రోటరీ క్లబ్ సేవా ప్రస్థానం నేడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల ఫలితంగానే ఈ గౌరవం దక్కిందన్నారు.
వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, విద్యార్థినులకు పునర్వినియోగ సానిటరీ ప్యాడ్ల పంపిణీ, ఉచిత సైకిళ్లు, టెలివిజన్ల పంపిణీ, కృత్రిమ అవయవాల శిబిరాలు వంటి కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని, 2026–27 సంవత్సరంలో మరింత నాణ్యమైన, పారదర్శకమైన సేవలతో క్లబ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
మహబూబాబాద్ రోటరీ క్లబ్‌కు అవార్డులు లభించడంపై ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ చీఫ్ విప్ తేజవత్ రామచంద్రు నాయక్, కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ కొర్ణు రవీందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు బోనగిరి గిరిధర్ గుప్తా, బొల్లం శ్రీనివాస్, ముల్లంగి మోహన్ రెడ్డి, గూడూరు నాగేశ్వరరావు, కళ్లెం వెంకట్ రెడ్డి, కొడారి నాగేందర్, దూదికట్ల సత్యం, సాధు మహిపాల్ రెడ్డి, లక్ష్మీనర్సింహారావు, బోయినిపల్లి సతీష్ రావు, జంగాల మంగపతి రావు, జంగాల నర్సింహారావు, ఓదెల శివకుమార్, నాళ్ల వీరన్న, వల్లాల రమేష్, అచ్చ శ్రీనివాస్, మాలె శ్రవణ్, ఇమ్మడి కృష్ణమూర్తి, తోడేటి వెంకన్న, కట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.