CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:07 pm Posted by : rakeshkashaveni12@gmail.com

యూరియా సరఫరా సన్నబియ్యం సాగుపై సమీక్ష

సిద్దిపేట , జూలై 3(చైతన్యగళం):

జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 36 శాతం అదనంగా వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ పూర్తవడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎవరూ వ్యవహరించరాదని స్పష్టం చేశారు.

జిల్లాలో ఇప్పటివరకు 6,351 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం మాత్రమే కొనుగోలు జరిగిందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్నబియ్యం సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.

వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో పెంకుటిళ్లు లేకుండా పక్కా ఇళ్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, జిల్లాలోని అన్ని పెంకుటిళ్లను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు మంచి పురోగతి సాధిస్తున్నారని అభినందిస్తూ, పేదల సొంతింటి కలను సాకారం చేసేలా మరింత కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అసంపూర్తి మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

బస్తీ దవాఖానల్లో వైద్యుల కొరత ఉంటే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని మంత్రి ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతు పనులను కూడా ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు.

టామ్ కామ్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా దేశాల స్థానిక భాషలపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో యువత పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలో 5.17 లక్షల ఎకరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, డ్రోన్ల ద్వారా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు

జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సమృద్ధిగా ఉందని, యాప్ ద్వారా ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు, యూరియా సకాలంలో అందేలా చూడాలని, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వైద్యుల నియామకం వేగవంతం చేయాలని పేర్కొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య తదితరులు పలు అభివృద్ధి అంశాలపై సూచనలు చేశారు ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు