మహబూబాబాద్, జూలై 2 (చైతన్య గళం):
రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల సంస్థ చేపట్టిన ‘మిషన్ K-100’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ సూచించారు.
గురువారం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఖరీఫ్ 2025-26, రబీ 2025-26 సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. సీఎంఆర్ (కస్టమ్ మిల్డ్ రైస్) సరఫరా, ఆర్థిక నిర్వహణ, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికగా మిషన్ K-100 రూపొందించబడింది” అని వివరించారు.
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు:
* కార్యాచరణ సామర్థ్యం పెంపు
* ఆర్థిక స్థిరత్వం బలోపేతం
* సంస్థాగత జవాబుదారీతనం మెరుగుదల
* *కొనుగోలు ప్రక్రియ యాంత్రీకరణ*కు ప్రాధాన్యం
జిల్లాలోని రైస్ మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న సీఎంఆర్‌ను సకాలంలో ఎఫ్‌సీఐకి సరఫరా చేయాలని, పెండింగ్ డెలివరీలను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రతి మిల్లుకు రోజువారీ, వారపు, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.
రబీ 2022-23 సీజన్‌కు సంబంధించిన వేలం ధాన్యం ఖర్చుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇప్పటివరకు మిల్లర్ల నుంచి రూ.7 కోట్ల మేర బకాయిలు వసూలు చేసినట్లు, మిగిలిన డిఫాల్ట్ మిల్లర్ల నుంచి కూడా రికవరీ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జే. రమేష్, జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ వి. నరసింహరావు, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, కోశాధికారి చిల్లంచెర్ల సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.