కరీంనగర్, జూలై 2 {చైతన్యగళం}:
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం మానకొండూరు మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లింగాపూర్, తెనుగుపల్లి గ్రామాల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 భారీ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు. ఈ డంపుల్లో మొత్తం 115 ట్రిప్పుల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలతో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.