రాజన్న సిరిసిల్ల, జూలై 1 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన కొనరావుపేట్ మండలం మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ బుధవారం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నూతన బాధ్యతలు చేపట్టిన అన్నపూర్ణను శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, “జిల్లాలో మహిళా మోర్చా సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు, ప్రతి ఇంటికి చేరేలా మహిళా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి” అని సూచించారు.
అదేవిధంగా, మండలాలు–గ్రామాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పార్టీ తరఫున చురుకుగా పనిచేయాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు వేముల వైశాలి, ఎల్లారెడ్డిపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, చింతల్తానా గ్రామ సర్పంచ్ గుర్రం అనసూయ, మహిళా నాయకురాలు జమున తదితరులు పాల్గొన్నారు.