CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం):
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ కంబాలపల్లి గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్న తీరును ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయాలని, సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. “ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలి” అని కలెక్టర్ ఆదేశించారు.

దరఖాస్తులను నిర్ణీత గడువులో స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా సరైన సమాచారం అందించి ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం మహబూబాబాద్ పట్టణంలోని 35వ వార్డులో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్కు సిబ్బంది ఫారాలను అందజేశారు.

జిల్లా వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పూర్తి సమాచారం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే సోషల్ మీడియా సహా వివిధ సమాచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ఈ పరిశీలనలో ఏఈఆర్‌ఓ కట్టం చంద్ర రాజేశ్వర్ రావు, బీఎల్‌వో సూపర్వైజర్ జి. కవిత, బీఎల్‌వో పి. కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.