మంచిర్యాల (చైతన్యగళం):
రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘ భవనం, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు రుణ సదుపాయాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం చేయూత అందిస్తోంది” అని అన్నారు.
గ్రామైక్య సంఘ భవనం రూ.15 లక్షల DMFT నిధులతో నిర్మించబడిందని, స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాం తయారీలో, పెట్రోల్ బంకుల నిర్వహణలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, వాటిలో వెయ్యి ఇండ్లు త్వరలో పూర్తవనున్నాయని చెప్పారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాల ద్వారా మహిళలకు చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు.
వైద్యరంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వచ్చే నెల నుండి పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.