CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 5:03 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఇంటి స్థలాలు, పట్టాలు, నెంబర్ల కోసం సీపీఐ కలెక్టరేట్ ముట్టడి

మహబూబాబాద్, జూలై 1 (చైతన్యగళం): ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.

ట్రాక్టర్‌పై గుడిసె ఏర్పాటు చేసి, ఇంటి నమూనాలను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధితో పాటు సుమారు 40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా విజయసారధి మాట్లాడుతూ, “ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం అందే వరకు సీపీఐ పోరాటం కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా పేదలకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది” అని ఆరోపించారు.

ధరణి, భూ భారతి పేర్లతో భూ కబ్జాదారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు పేదలు చిన్నచిన్న స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చివేసి కేసులు నమోదు చేయడం అన్యాయమని అన్నారు. గుడిసెవాసులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలో వేలాది కుటుంబాలకు ఇప్పటికీ ఇంటి నెంబర్లు, పట్టాలు లేవని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వేలాది మందిలో కొద్దిమందికే పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుతం ఇందిరమ్మ గృహ పథకంలో పట్టా ఉంటేనే ఇల్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం కొత్తగా పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు.

ఇంటి నెంబర్లు, పట్టాలు లేక అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొందరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు, పట్టాలు, నెంబర్లు మంజూరు చేయాలి. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ సారధి, నన్ను సుధాకర్ రెడ్డి, కట్టబోయిన శ్రీనివాస్, పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు, తండా సందీప్, నరా శ్రావణ్, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, తురక రమేష్, సమ్మయ్య, ఆబోతు అశోక్, మహమూద్, చిరంజీవి పాల్, వెంకటరెడ్డి, చిర్ర సత్యనారాయణ, భూక్య హరి, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.