CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 9:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి

సుల్తానాబాద్, జూలై 1(చైతన్యగళం):

పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) దేవస్థానంలో బుధవారం తేనెటీగలు భక్తులపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు విరుచుకుపడటంతో ఆలయ ప్రాంగణం క్షణాల్లోనే భయాందోళనకు గురైంది. భక్తులు ప్రాణభయంతో పరుగులు తీయడంతో ఆలయ పరిసరాలు గందరగోళంగా మారాయి. దర్శనం అనంతరం, చెట్ల కింద వంట చేసుకుంటుండ గా ఒక్కసారిగా పొగ రావడం తో తేనెటీగలు లేచి దాడి చేశాయని అక్కడున్న భక్తులు తెలిపారు.

కరీంనగర్ నుండి పెద్దపల్లి మండలం హనుమంతుని పేట నుంచి కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు అక్కడే ఉన్న పలువురిపై తేనెటీగలు ఒకేసారి దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరు నెలల పసిపాపతో సహా సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. చిన్నారిపై కూడా తేనెటీగలు దాడి చేయడంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయలను గురైన వారిని వెంటనే 108 సిబ్బంది ఈఎంటి నరేష్ , పైలెట్ రాజేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించి, క్షతగాత్రులను కాల్వ శ్రీరాంపూర్ ఆసుపత్రికి తరలించారు, అక్కడినుండి కొంతమందిని చికిత్స కోసం కరీంనగర్ కు తరలించడం జరిగింది… ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రజా ప్రతినిధులను,అధికారులను, కోరుతున్నారు,