CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:33 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు.. రూ.70 లక్షలు సీజ్

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో పోలీసులు నిందితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుల ఇళ్ల నుంచి రూ.70,25,000 నగదును సీజ్ చేశారు. అత్యధిక శాతం నగదు నిందితుడు అవినాశ్ శుక్లా ఇంట్లో లభించింది. అతడి ఇంట్లో రూ.20 లక్షలను సీజ్ చేశారు. కరుణేశ్ పాండే ఇంటి నుంచి మరో రూ.18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనుకల్ప్ మిశ్రా ఇంట్లో రూ.16 లక్షలు లభించాయి. అవినాశ్ శుక్లా ఇంట్లో 1,121 యూఎస్ డాలర్స్ కూడా లభించాయి.

ఆయోధ్య రామ మందిర విరాళాల అవకతవకల కేసుపై దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ నివేదిక మేరకు జూన్ 25న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అవినాశ్ శుక్లా, అనుకల్ప్ శుక్లా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, శుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జులై 13 వరకూ వారికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దర్యాప్తులో భాగంగా పలు చోట్ల రెయిడ్స్ నిర్వహిస్తున్న పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు.