CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 2:46 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ,జూన్ 29(చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి దున్ని, విత్తనాలు చల్లి ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భూమాతను ప్రార్థించినట్లు తెలిపారు. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని, భూమాతకు నమస్కరించి కొత్త వ్యవసాయ పనులను ప్రారంభించే పవిత్రమైన రోజుగా దీన్ని భావిస్తారని పేర్కొన్నారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆ అన్నాన్ని పండించే రైతే దేశానికి వెన్నెముక” అని అన్నారు.

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. నీటిని పొదుపుగా ఉపయోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని పంటలు క్రిమికీటకాల బారిన పడకుండా రైతులకు మంచి దిగుబడులు, ఆర్థిక లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.