CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 10:08 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా: సీఎం రేవంత్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ రూ.1 కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడంలో ఉద్యోగులదే కీలకపాత్ర అని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, ప్రమాద బీమా పథకాన్ని తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించామన్నారు. 45 మంది కార్మికుల కుటుంబాలకు బీమా సాయం అందించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని, ఉద్యోగుల సమస్యలు, వారి అవసరాలు తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అందరికీ భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

తాను దొరను కాదని, ప్రజల మధ్య నుంచి ఎదిగిన వ్యక్తినని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. మంత్రివర్గానికీ తానే మేస్త్రీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు అవహేళన చేసినా పట్టించుకోనని, రేవంతన్నగా పిలిపించుకోవడమే తనకు ఇష్టమని చెప్పారు. పదవులు, హోదాలు మారొచ్చుగానీ ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు. అలాగే గత పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 10వ తేదీ వరకు కూడా జీతాలు అందని పరిస్థితి ఉండేదని విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1 నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.