దేశంలో పౌరసత్వ రుజువుపై ఒకవైపు తీవ్ర చర్చ నడుస్తుండగానే.. కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. మీరు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా లేదా ఉన్న పాస్‌పోర్ట్‌ను రిన్యూవల్ చేయించుకోవాలన్నా ఇకపై జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. వచ్చే నెల జూలై 1, 2026 నుండి ఫీజులను భారీగా పెంచుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నా లేదా కొత్త పాస్‌పోర్ట్ పొందాలని ఆలోచిస్తున్నా.. మీకోసం ఒక ముఖ్యమైన హెచ్చరిక. జూలై 1 నుండి దేశంలో పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెరగనున్నాయి. పాస్‌పోర్ట్ నిబంధనలలో మార్పులలో భాగంగా ఫీజులను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనలు, 1980ని సవరిస్తూ, సవరించిన కొత్త రుసుములను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త రుసుములను షెడ్యూల్ IVలో చేర్చారు. దీని ప్రకారం ఇకపై సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు రెండింటికీ దరఖాస్తుదారులు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. 18 సంవత్సరాలు పైబడిన పెద్దల కోసం కొత్తగా లేదా తిరిగి జారీ చేయబడిన 36 పేజీల పాస్‌పోర్ట్ ప్రామాణిక రుసుమును రూ.1,500 నుండి రూ.2,500కి పెంచారు. అంటే దరఖాస్తుదారులు ఇప్పుడు అదనంగా రూ.1000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే అత్యవసరంగా తత్కాల్ సేవను ఎంచుకునే వారు ఇప్పుడు రూ.3,500కి బదులుగా ఏకంగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ కేటగిరీలో రూ.1,500 భారం పెరిగింది.
మరోవైపు ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఉపయోగించే 60 పేజీల జంబో పాస్‌పోర్ట్‌ల రుసుములను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. దీని ప్రకారం 60 పేజీల పాస్‌పోర్ట్ సాధారణ దరఖాస్తు రుసుము ఇప్పుడు రూ.2,000 నుండి రూ.3,500కు పెరగ్గా.. తత్కాల్ దరఖాస్తు ఫీజు రూ.4,000 నుండి ఏకంగా రూ.6,000కు చేరుకుంది. అంటే ప్రజలు తమకు అవసరమైన ఈ పెద్ద పాస్‌పోర్ట్‌ల కోసం ఇప్పుడు వేలల్లో అదనపు డబ్బును కేటాయించుకోవాల్సి వస్తోంది. ఒకవేళ మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా పాడైపోయినా, దాని స్థానంలో కొత్తది పొందడం ఇప్పుడు మరింత ఖరీదైనదిగా మారింది. పోగొట్టుకున్న లేదా పాడైన 36 పేజీల పాస్‌పోర్ట్‌ను తిరిగి జారీ చేయడానికి సాధారణ ఫీజు రూ.5,000 కాగా తత్కాల్ కింద అది రూ.7,500 గా మారింది. అదేవిధంగా పోగొట్టుకున్న 60 పేజీల పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందాలంటే సాధారణ రుసుము రూ.6,000, తత్కాల్ ఛార్జీలు రూ.8,500 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మైనర్లకు ఇలా
ఇక 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ల విషయానికి వస్తే.. వారి 36 పేజీల కొత్త లేదా మళ్లీ జారీ చేసే పాస్‌పోర్ట్ సాధారణ ఫీజు రూ.1750 కాగా, తత్కాల్ ఫీజు రూ.4,250 గా ఉంటుంది. ఒకవేళ మైనర్లు తమ 36 పేజీల పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకుంటే.. దాన్ని తిరిగి పొందడానికి సాధారణ రుసుము కింద రూ.4,250, తత్కాల్ కింద రూ.6,750 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇతర అనుబంధ పత్రాల ఫీజులను కూడా సవరించారు. గుర్తింపు పత్రం ఫీజును రూ.1,000 గా నిర్ణయించగా, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ , సరెండర్ సర్టిఫికేట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్, ఇతర పాస్‌పోర్ట్ ఆధారిత సర్టిఫికేట్ల ఫీజును రూ.750 కి పెంచారు. ఇక విదేశాల నుండి దరఖాస్తు చేసుకునే వారి కోసం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును 125 యూఎస్ డాలర్లుగా, తత్కాల్ ఫీజును 250 యూఎస్ డాలర్లుగా నిర్ణయించారు.
పాస్‌పోర్ట్ వాలిడిటీ విషయానికి వస్తే.. 18 సంవత్సరాలు పైబడిన వారికి జారీ చేయబడిన సాధారణ పాస్‌పోర్ట్ యొక్క చెల్లుబాటు 10 సంవత్సరాలు ఉంటుంది. అదే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లకు జారీ చేయబడిన పాస్‌పోర్ట్ చెల్లుబాటు కేవలం 5 సంవత్సరాలు లేదా వారు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మినహాయింపును మాత్రం యథాతథంగా కొనసాగించింది. 8 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులపై 10శాతం ఫీజు రాయితీ లభిస్తుంది. అయితే ఈ 10 శాతం మినహాయింపు అనేది కేవలం కొత్తగా తీసుకునే పాస్‌పోర్ట్ దరఖాస్తుకు మాత్రమే వర్తిస్తుంది కానీ పాత పాస్‌పోర్ట్ తిరిగి పొందడానికి వర్తించదని గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతం పాత రేట్లకే పాస్‌పోర్ట్ తయారు చేయించుకోవడానికి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత అంటే జూలై 1 నుండి కొత్తగా దరఖాస్తు చేసేవారంతా ఖచ్చితంగా పెంచిన రేట్లనే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, ఈ జూన్ ఆఖరు లోపు అప్లై చేసుకోవడం ద్వారా అదనపు భారం పడకుండా డబ్బు ఆదా చేసుకోవచ్చు. కాగా దేశంలో పౌరసత్వ రుజువుపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ పాస్‌పోర్ట్ ఫీజులు పెరగడం గమనార్హం. భారత పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక అంతర్జాతీయ ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువు కాదని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది.