మర్రిగూడ, జూన్ 25 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలో సర్–2026 ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ సాయి అధికారులు, బి ఎల్ ఓ లు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. ప్రతి ఓటరు ఈ ఫారాలను తప్పకుండా స్వీకరించి, గత సవరణలోని మ్యాపింగ్ వివరాలను స్పష్టంగా నమోదు చేసి, పూర్తిగా నింపి సంబంధిత బి ఎల్ ఓ లకు తిరిగి అందజేయాలి” అని తెలిపారు.
తహసిల్దార్ హెచ్చరిస్తూ, “ఒకవేళ ఎవరు ఈ ఫారాలను నింపి తిరిగి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వారికి ఓటు హక్కు లభించదు. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష, ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్, బిఆర్ఎస్ నాయకులు రాపోలు యాదగిరి, కొలుకులపల్లి యాదయ్య, బిజెపి నాయకులు పొట్లవత్ రాజేందర్ నాయక్, గ్యార గోపాల్, కాంగ్రెస్ నాయకులు పగడాల లింగయ్య, ఎండి జబ్బార్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, బి ఎల్ ఓలు పొనుగోటి రమాదేవి, పానుగంటి పద్మ, ఈద లక్ష్మమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.