CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 8:59 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

500 మంది పోలీసులతో బందోబస్తు – ఎస్పీ సునీల్ షొరాణ్

కర్నూలు, జూన్ 24 (చైతన్య గళం): మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న విచ్చేయనున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ పరిశీలించారు.

సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎస్పీ తెలిపారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు, సిబ్బందికి భద్రతా విధులపై ప్రత్యేక సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్ర బాబు, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.