CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 1:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వీడిన సస్పెన్స్.. సాయికృష్ణ మరణాన్ని ధృవీకరించిన సిట్.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వాస్పత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తికావడంతో 2వ ఏజేఎస్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు.

విజయవాడ, జూన్ 24(చైతన్యగళం): గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వాస్పత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తికావడంతో 2వ ఏజేఎస్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టుకు సిట్.. రిమాండ్ రిపోర్టును సమర్పించింది. రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని, డెడ్‌బాడీని డెస్ట్రాయ్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపర్చలేదని సిట్ వెల్లడించింది.

‘సాయికృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్‌లో తీసుకువచ్చి మాయం చేశారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టాం. 17 మంది సాక్షులను‌ విచారణ చేశాం. ఫోరెన్సిక్ బృందం సాయంతో సీసీటీవీ కెమెరా ఫీడ్‌ స్వాధీనం చేసుకున్నాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ‌హిమజ అనే స్టేషన్ సిబ్బందిని ‌విచారించాం. కృష్ణలంక‌ పోలీస్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ డేటా సిస్టమ్‌లో లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీస్‌ స్టేషన్‌లోనే చూసినట్లు… మే5 నుంచి మే8 మధ్య సాయికృష్ణని కృష్ణలంక పీఎ‌స్‌లో చూసినట్డు ఎస్‌ఐ వాంగ్మూలం ఇచ్చారు’ అని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది.

‘సాక్షాలను నాశనం చేయడానికి , పోలీసు కస్టడీలో లేకుండా పోవడానికి సీఐ నాగరాజే కారణం. సీసీటీవీ ఫుటేజ్ డేటా(1-5-26 నుంచి 1-6-26 వరుకు) డీవీఆర్‌లో లేకుండా చేశారు. ఫోరెన్సిక్ బృందానికి పరీక్ష కోసం డీవీఆ‌ర్‌లను పంపించాం. సాయికృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మేజిస్ట్రేట్‌కు చేరవేయలేదు. సాయికృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్‌కు వెళితే సీఐ నాగరాజు దూషించాడు. హైకోర్టులో సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కోర్ట్ ముందు వాస్తవాలను వెల్లడించలేదు. హైకోర్ట్ ముందు నిజాలు దాచారు , కోర్ట్‌ను తప్పుదోవ పట్టించారు. ఈ పరిణామాలన్నీ గమనించాక సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశాడని గుర్తించాం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు. అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందుతుడైన నాగరాజును విచారించాల్సి ఉంది. జూన్ 2 కంటే ముందే సాయికృష్ణ మరణించాడని మేము విశ్వస్తున్నాం. కస్టడీలో ఉండగా గాయాలపాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి’ అంటూ రిమాండ్‌ రిపోర్ట్‌లో సిట్ వెల్లడించింది. చివరకు సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్ నిర్ధారించింది.