CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 2:17 pm Posted by : Dakka Jambulaiah

ప్రైమరీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

 

నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలి

జిల్లా కలెక్టర్  జి. రాజకుమారి

నందికొట్కూరు(చైతన్యగళం)

జిల్లాలోని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో “మన బడి – మన భవిష్యత్తు” ఫేజ్-2 కింద చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని అందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు, వరండాలను తరగతి గదులుగా మార్పు, విద్యుదీకరణ పనులు, తాగునీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం తదితర నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మరో పది రకాల మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను సిద్ధం చేసి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

‘మన బడి – మన భవిష్యత్తు’ కార్యక్రమం అమలులో సమగ్ర శిక్షతో పాటు ఏపీడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని 29 మండలాల్లో కొనసాగుతున్న పెండింగ్ పనులను శాఖల వారీగా బాధ్యతలు కేటాయించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్-2 పరిధిలో ఉన్న పాఠశాలల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.*

*ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.