CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:29 pm Posted by : rakeshkashaveni12@gmail.com

హుస్నాబాద్ డయాలసిస్ కేంద్రంపై విమర్శలు

హుస్నాబాద్, జూన్ 24 (చైతన్యగళం): హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు డయాలసిస్ సేవలు సక్రమంగా అందడం లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్ తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు పడకలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఎల్కపెల్లి కనకరాజు డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు సాంకేతిక సమస్యను కారణంగా చూపి వారం రోజులుగా చికిత్స అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మల్లేశ్ పేర్కొన్నారు. “ఆధార్ సమస్య పేరుతో రోగులను తిప్పలు పెట్టడం దారుణం” అని ఆయన వ్యాఖ్యానించారు.

డయాలసిస్ కేంద్రంలోని సిబ్బంది రోగులతో మానవత్వంతో వ్యవహరించి మెరుగైన సేవలు అందించాలని, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి పర్యవేక్షణను మరింత బలపరచాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.